ఊరు: సువిశాల ప్రపంచం,
తేదీ: కాలాతీతమైన రోజు.

గౌరవనీయులైన స్వర్గీయ నిస్సంకర సావిత్రి గారికి,

                                       తమ వీరాభిమాని ఐన ఆకాశరామన్న అత్యంత గౌరవ మర్యాదలతో నమస్కరించి వ్రాయునది. నేను క్షేమం.  మీరు స్వర్గమందు క్షేమమని తలుస్తాను. తమ పై ఉన్న యెనలేని అభిమానం మబ్బుల రాయభారి తో ఆకాశవీధుల మీదగా ఈ ఆకాశరామన్న ఉత్తరాన్ని మీకందిస్తుందని నా నమ్మకం.

వ్యాపారం పెరిగింది… విలువలు తగ్గాయ్…
ముఖం పై రంగు పెరిగింది…అభినయం తగ్గింది…
సాంకేతికం గా ముందుకెళ్తుంది… సంస్కారం పరంగా సర్వ నాశనం అవుతుంది…
ఇది ఈనాటి సినీ రంగపు పోకడ తల్లీ..!

తెర పై ఆడది చిరిగిన బట్టలు వేస్తే చాలట!సినిమా కి పెట్టిన పెట్టుబడంతా పది రోజుల్లో జమైపోతుందట… తెర పై హీరో నడిస్తే చాలట! అణువంత అభినయం కూడా లేకపోయినా ఈలలూ గోలలూనట… “కళ” అంటే  అర్ధ నగ్న ప్రదర్శన కాదనీ, సాక్షాత్తూ సరస్వతీ స్వరూపమనీ నేటి సినీ రంగ తారాగణానికీ, దర్శకులకీ ఒక్కసారి గుర్తు చేయడానికైనా మళ్లీ మా ముందుకు రావమ్మా..!

“నవరసాలనూ రెండు నేత్రాలలో నింపుకున్న బంగారు బొమ్మ.., మా సావిత్రమ్మ..! నటనకు  ప్రాణం పోస్తే సావిత్రి గారిలా ఉంటుంది. తెలుగుదనం తల ఎత్తి చూస్తే సావిత్రి గారి లాగే ఉంటుంది.జాలి, దయ, కరుణ అనే మూడింటికి త్రివేణి సంగమం మా సావిత్రమ్మ…” ఇప్పటికీ తెలుగు వారంతా అనుకునే మాటలు ఇవే తల్లీ!అప్పట్లో సావిత్రి గారి చీరకట్టు, వాణిశ్రీ కొప్పు, జమున గారి కాటుక లాంటివి బాగా ప్రఖ్యాతి గాంచిన మాటలు… కాని ఇప్పుడు ఆ చీరకట్టు చాలా బరువైపోయిందటమ్మా… బికినీలకి ఇచ్చే ప్రాధాన్యత నేటి కధానాయికలు చీరకట్టు కి ఇవ్వడం లేదు తల్లీ…ముద్దుగా బొద్దుగా ఉంటూనే మీరు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు, అలరించారు. ఈ రోజుల్లో తారలదరూ జీరో సైజ్ మోజులో పడి మరీ కరువు ప్రాంతపువాసుల్లా తయారౌతున్నారు. బాగా కొవ్వు పెరిగిపోయినా కూడా లైపోసెక్షన్ పేరుతో దాన్ని కరిగించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అతివ్రుష్టి, అణావ్రుష్టి అన్నట్టు ఉందమ్మా వీళ్ళ వరస… వీళ్ళకి మీలా క్రమబద్ధమైన అలవాట్లు కర్ర పుచ్చుకుని నేర్పడానికైనా ఒక్కసారి రావమ్మా…!

నీళ్ళ బిందెలు మోసే సన్నివేశాలు వస్తే బిందె నిండుగా నీరు నింపుకుని నిజంగానే మోసేదానివట… సమయానుగుణంగా వచ్చేటట్టు గ్లిజరిన్ పోసుకోగా వచ్చే కన్నీళ్ళను కూడా అదుపు చేసుకునేదానివట… నిర్మాతలు ఒక్కోసారి నష్టాలలో ఉంటే పారితోషకం గురించి పట్టించుకునేదానివే కాదట… ఈ కాలం లో అలా యెవరున్నారు సావిత్రమ్మా??? నీ పక్కన హీరోలు గా నటించినవారందరినీ సోదరులగానే సంబోధించేదానివట… షూటింగ్ జరుగుతున్నన్ని రోజులూ ఒక కుటుంబంలో అమ్మయిగానే కలిసిపోయి ఉండేదానివట… ఈ రొజుల్లో ఆ వ్యక్తిత్వం ఎవ్వరికుందమ్మా??? ఆకాశానికి చంద్రుడొక్కడే..! అలాగే తెలుగు సినీ వినీలాకాశానికి సావిత్రి ఒక్కరే..!

నీకు లేని సమయం లో కూడా యెవరైనా నీ సాయం కోరి వస్తే ఉన్నది కూడా అమ్మి వాళ్ళ కష్టాన్ని తీర్చిన కరుణా సంద్రానివి నువ్వు. సకల సిరి సంపదలూ చుసిన నీ కథ కడకొచ్చేసరికి కన్నీరే మిగిలిందా తల్లీ!?! నీ పై కోపం చూపించిన విధిపై అలిగి మమ్మల్నందరినీ వదిలి వెళ్ళిపోయావు… నీ అభిమానులమైన మాకు ఇంకొక్క అవకాశం ఇచ్చి మళ్ళీ పుట్టవా తల్లీ! ఈ సారి మాత్రం నీ జీవితాన్ని రాక్షసుల చేతికి చిక్కనివ్వమమ్మా..!మా మహా నటిని మా గుండెల్లోనే పెట్టి చూసుకుంటాం…

కనుక వీలైతే మళ్ళీ మా ముందుకు రా సావిత్రమ్మ!!!

తెలుగుతనాన్ని బ్రతికించదానికి..,తెలుగు గుండెలను అలరించడానికి…

మాతృ తుల్యులు, సరస్వతీ సమానులైన సావిత్రి గారికి అత్యంత గౌరవం తో కోటి నమస్కారాలు పెడుతూ సెలవు తీసుకుంటున్నాను…

ఇట్లు,

mee-aakasaramanna

Facebook Comments